
KS Bharat

KS Bharart | జట్టులోకి రాలేదు. బ్యాట్ పట్టలేదు. కానీ మైదానంలో అద్భుతం సృష్టించాడు. టీమిండియాలో సరికొత్త సంచలనంగా మారాడు. మాజీ క్రికెటర్లు సైతం ‘ఇతడిని జట్టులోకి తీసుకుని ఉండాల్సింది’,‘ఫ్యూచర్‌లో ఇంకా ఇరగదీస్తాడు’ అని అతడిని ఆకాశానికెత్తేస్తున్నారంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో వేరే చెప్పక్కర్లేదు.
అతడి పేరు కేఎస్ భరత్. మన ఆంధ్రా కుర్రాడు. ఎంతో కష్టపడి న్యూజిల్యాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనా జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఏం సాహా గాయపడడంతో స్టాండ్‌బై వికెట్ కీపర్‌గా జట్టులోకొచ్చి మెరుపులు మెరిపించాడు. ఓ రోజంగా టీమిండియాకు చుక్కలు చూపించిన న్యూజిల్యాండ్ ఓపెనర్లు సెంచరీలు చేయకుండా అడ్డుకున్నారు.
వాళ్లు అవుట్ అయింది బౌలర్ల ఖాతాలోకే వెళ్లినా.. ఆ వికెట్లలో భరత్ భాగస్వామ్యం మాత్రం కచ్చితంగా అభినందించదగినది. అందులో సందేహం లేదు. 89 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విల్ యంగ్ ఇచ్చిన లో క్యాచ్‌ను భరత్ అందుకున్న తీరు.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో కెప్టెన్‌ను రివ్యూకు వెళ్లమని కాన్ఫిడెంట్‌గా కన్విన్స్ చేసిన తీరు అద్భుతం.
ఆ తర్వాత 95 పరుగుల వద్ద టామ్ లాథమ్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వెళ్లి బంతి మిస్ అయ్యాడు. ఆ సమయంలో కూడా భరత్ బంతిని షార్ప్‌గా అందుకుని క్షణంలో వికెట్లు గిరాటేశాడు. లాథమ్‌కి కనీసం వెనక్కి తిరిగి చూసే టైం కూడా ఇవ్వలేదు.
జట్టులోకి రాకుండానే ఈ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో భరత్ వికెట్ కీపింగ్‌ను టీమిండియా మాజీలు సైతం అభినందిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ ఆటగాడు, వీవీఎస్ లక్ష్మణ్.. భరత్ వికెట్ కీపింగ్ బాగా చేశాడని, వికెట్ల వెనుక అతడి కదలిక అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. భవిష్యత్తులో భరత్ మరింత గొప్ప ప్లేయర్ అవుతాడని ఆశాబావం వ్యక్తం చేశాడు.

ఇక నెటిజన్లు కూడా భరత్ ఆటతీరును మెచ్చుకుంటున్నారు. పిచ్‌లో బౌన్స్ లేదని గ్రహించిన భరత్.. అందుకు అనుగుణంగా తన కీపింగ్‌ను మార్చుకున్నాడని, ఇది సీనియర్ ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే ఈ స్కిల్ భరత్‌లో ఇప్పటి నుంచే ఉందని, టీమిండియాకు ఇతడు మంచి కీపర్ అవుతాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే కొంతమంది మాత్రం భరత్‌ను అభినందిస్తూనే ప్రస్తుత జట్టులోని సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు చురకలు వేస్తున్నారు. సాహా టైం అయిపోయిందని, భరత్ ఆ స్థానాన్ని సునాయాసంగా భర్తీ చేసేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘బైబై సాహా’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.