Beggar English | కుటుంబం గెంటేసిన బెగ్గర్.. కానీ ఆమె ఇంగ్లీష్ వింటే షాకవ్వాల్సిందే..

Beggar English

Beggar English: పై ఫోటో చూశారు కదా. ఆమెను చూడగానే మీకేమనిపిస్తుంది. చినిగిపోయిన చీర. మట్టిబట్టిన శరీరం. చూడగానే ఓ యాచకురాలు అని అర్థమవుతుంది. కానీ ఆమె ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడిందంటే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆమె అమెరికన్లతో సమానమైన ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె మాట్లాడే స్థాయిలో ఇంగ్లీష్‌లో రావాలంటే అంత సులభం కాదు. ఇంగ్లీష్ మీద ఎంతో పట్టుంటేనే సాధ్యమవుతుంది. ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆమె నివశిస్తోంది. ఆమె పేరు స్వాతి. ఆమె ఇంగ్లీష్ మాట్లాడడం చూసిన ఓ వ్యక్తి.. ఆమెతో మాట్లాడుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో వైరలైంది.
స్వాతి దక్షిణ భారతదేశానికి చెందిన మహిళ. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. మంచి ఉద్యోగం కూడా చేసేది. కొంతకాలం క్రితం వరకు ఆమె జీవితం ఎంతో గొప్పగా ఉండేది. భర్త, కొడుకుతో అందరిలానే ఆనందంగా గడిచేది. కానీ ఉన్నట్లుండి ఆమెకు పెరాలసిస్ రావడంతో ఆమె జీవితం తలకిందులైంది. డెలివరీ సమయంలో కుడి కాలు, కుడి చేతి పక్షవాతం వల్ల పడిపోయాయి. నడవలేని స్థితికి చేరుకోవడంతో సొంత భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారు. తన వాళ్ల నుంచి అలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ఆ బాధతోనే ఎలాగోలా వారణాసి చేరుకుంది స్వాతి. దాదాపు మూడేళ్ల నుంచి ఆమె వారణాసిలోనే భిక్షాటన చేస్తూ బతుకుతోంది.
ఆమె మాటలు రికార్డ్ చేసిన వ్యక్తి.. కచ్చితంగా ఉద్యోగం చూస్తానని స్వాతికి చెప్పాడు. మరి అతడు చెప్పినట్లు ఉద్యోగం చూస్తే.. స్వాతికి ఆ ఉద్యోగంలో చేరి తిరిగి మునుపటి జీవితం లభిస్తుంది.