Akhanda | ‘అఖండ’ ఓటీటీ రిలీజ్ అప్పుడే.. చెప్పేసిన హాట్‌స్టార్


బాలకృష్ణ కెరీర్‌లోనే టాప్ కలెక్షన్లతో దూసుకుపోయిన చిత్రం ‘అఖండ’. బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసును కలెక్షన్లతో ముంచెత్తింది. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన చిత్రసీమకు కొండంత ధైర్యం అందించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలకు నమ్మకం కలిగించింది. బాలయ్య అభిమానులనే కాకుండా, అందరికీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అఖండ తర్వాత విడుదలైన పుష్ప కూడా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేస్తోంది. అలాంటప్పుడు ఇంకా అఖండ రాకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆతృత పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే అఖండ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ హాట్‌స్టార్‌ను ఇదే ప్రశ్న అడిగారు. దీంతో అభిమానులకు ఈ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. సినిమా విడుదలైన సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అఖండ సినిమాను జనవరి 2 లేదా 3 తేదీల్లో ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది.
కానీ విడుదలైన నాలుగు వారాల తర్వాత కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో ఓటీటీ విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు. దీనికోసం సినిమా దర్శక నిర్మాతలు.. డిస్నీ హాట్‌స్టార్ నిర్వాహకులతో చర్చలు కూడా జరిపారు. దీంతో అఖండ ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఎదురుచూపే మిగిలింది.
ఇప్పుడు జనవరి 7 నుంచి పుష్ప కూడా ఓటీటీలో వచ్చేస్తోందని ప్రకటించడంతో.. బాలయ్య ఫ్యాన్ ఒకరు డిస్నీ హాట్‌స్టార్‌ను ‘‘మా బాలయ్య సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు?’’ అని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన హాట్‌స్టార్.. ‘‘జనవరి 22 నుంచి అఖండ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది’’ అని సమాధానమిచ్చింది. ఇది చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.