

Tirupati | హ్యూమన్ హెయిర్.. అంటే మానవ వెంట్రుకలు చాలా అరుదైనవి. అందుకే వాటికి చాలా డిమాండ్. ప్రపంచంలో అనేక దేశాల్లో వీటిని వేరు వేరు అవసరాల కోసం వాడతారు. పెయింటింగ్ బ్రష్‌లు, ఫర్నిచల్, దుస్తుల లైనింగ్, విగ్గుల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా హెయిర్ ఎక్స్‌టెన్షనర్స్, హెయిర్ టాప్స్, విగ్స్, హెయిర్ వీవింగ్‌ల కోసం వినియోగిస్తారు. మిగతా అవసరాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విగ్గుల మార్కెటే 700 కోట్ల డాలర్ల విలువుంటుంది. 2024 నాటికి ఇది వెయ్యి కోట్లకు చేరుకుంటుందని అంచనా.
రెండో స్థానంలో ఇండియా:
ఇక వెంట్రుకల ఎక్స్‌పోర్టేషన్‌లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మిగిలిన దేశాలకంటే భారత్ అతి తక్కువ ధరకే వెంట్రుకలను విక్రయిస్తుంది. 2020 లెక్కల ప్రకారం.. 2వేల కోట్ల విలువైన వెంట్రుకలను విక్రయించి ప్రపంచంలోనే టాప్ 2 ఎక్స్‌పోర్టర్‌గా మారింది. మయన్మార్, అమెరికా, చైనా, ఇటలీ, చైనాలు భారత్ నుంచి ఎక్కువగా వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి. ముఖ్యంగా మహిళల వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఇవి సహజసిద్ధంగా అనిపిస్తాయి. అందుకే వీటికి మిగతా దేశాల్లో అంత డిమాండ్. అలాగే వీటి ధర ఎక్కువే. భారత్‌తో పాటు చైనా కూడా అత్యధికంగా వెంట్రుకలను ఉత్పత్తి చేస్తుంది. కానీ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చైనాతో పోల్చితే భారతీయుల వెంట్రుకలు పల్చగా ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ:

మన దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెంట్రుకల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తలనీలాలు సమర్పించడం ఎప్పటినుంచో సంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు. ఇక్కడ ప్రతి రోజూ 35వేల మంది తమ వెంట్రుకలు సమర్పించుకుంటారు.
ఇలా వచ్చిన వెంట్రుకలతో ఏటా 200 కోట్ల వ్యాపారం చేస్తోంది టీటీడీ. ఇది ఆలయ ఆదాయంలో 10 శాతం. బిగ్ లవ్ ఇండియన్ హెయిర్ సంస్థ అధినేత చందన్ సీతారాం చెబుతున్న దాని ప్రకారం.. ప్రతి నెలా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంట్రుకల వేలం జరుగుతుంది.
పెరిగిన ధర, పడిపోయిన సప్లై:

కోవిడ్ ముందు నెలకు 70వేల కిలోల వెంట్రుకల వేలం జరిగేది. అంతేకాదు కోవిడ్ ముందు నాణ్యమైన 19 నుంచి 26 అంగుళాల పొడవున్న వెంట్రుకలు కిలో రూ.16,500 ఉండేది. కానీ ఇప్పుడు ధర పెరిగి రూ.25వేలకు చేరింది. కోవిడ్ కారణంగా నాణ్యమైన వెంట్రుకల లభ్యత, విలువ రెండూ పెరిగాయి. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మొదట వెంట్రుకల సప్లై పడిపోయింది. దీంతో ధరలు పెరిగాయి.
కోవిడ్ ప్రభావం తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగింది. దాదాపు 45శాతం ఎక్స్‌పోర్టేషన్ పెరిగింది. కానీ వెంట్రుకల సప్లై మాత్రం 39శాతమే పెరిగింది. అందువల్లే ధర తగ్గలేదు. చైనానే టాప్: అయితే ప్రపంచ హెయిర్ మార్కెట్‌లో ఇండియా వాటా 32 శాతం మాత్రమే.
ఈ విషయంలో చైనా టాప్‌లో ఉంది. వరల్డ్ హెయిర్ మార్కెట్లో చైనా వాటా 50 శాతం. చైనాలో మెరుగైన టక్నాలజీ, స్థిరమైన పరిశ్రమలు, తక్కువ ధరకు పనిచేసే కార్మికులు ఉండమే దీనికి కారణం. చైనాతో పోల్చితే ఇండియా ఈ 3 విషయాల్లోనూ వెనుకబడి ఉంది. కానీ నాణ్యత, డిమాండ్ విషయంలో మాత్రం ఇండియానే టాప్. అందుకే చైనా కూడా భారత్ నుంచి వెంట్రుకలు దిగుమతి చేసుకుని వాటిని చైనీస్ హెయిర్‌తో కలిపి విగ్గులు, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తుంది.
స్మగ్లింగే ప్రధాన సమస్య:

ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్న వాటిలో ప్రధానమైంది స్మగ్లింగ్. ఓ సర్వే ప్రకారం.. ఇండియాలో ఏటా రూ.150 కోట్ల విలువైన హెయిర్ స్మగ్లింగ్ జరుగుతోంది. ఈ హెయిర్‌ను ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు ఈ మధ్యకాలంలో దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టారు. దేశంలోని హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రాడక్ట్స్ మ్యాన్యుఫ్యాక్ఛరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కూడా ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చిస్తోంది. రా హెయిర్ ఎక్స్‌పోర్టేషన్‌పై బ్యాన్ విధించాలని కోరుతోంది. విచిత్రం ఏంటంటే ఇలా స్మగ్లింగ్ అయిన రా హెయిర్‌లో అత్యధికంగా చైనాకే వెళుతోంది.
2020 ప్రకారం:

గ్లోబర్ హ్యూమన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, విగ్స్ వినియోగంలో 40 శాతం వాటా నార్త్ అమెరికాదే. ఈ మార్కెట్లో 22 శాతం సీనియర్ సిటిజన్స్‌దే. టీనేజ్ నుంచే అమ్మాయిలు విగ్గుల, హెయిర్ ఎక్స్‌టెన్షన్ వాడుతుంటారు. అందులోనూ, ఆఫ్రికన్స్, కొకేషియన్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అమెరికా మాత్రమే కాదు ఇండియా, చైనా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, స్పెయిన్, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, యూఏఈ వంటి దేశాల్లో కూడా వీటికి మార్కెట్ ఉంది. 2026 నాటికి ప్రపంచంలో విగ్స్ అండ్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ మార్కెట్ ఏకంగా లక్ష కోట్లు దాటేస్తుందని అంచనా. అయతే ఇందులో 70 శాతం సింథటిక్ జుట్టుతో తక్కువ ధరకు దొరికేలా తయారు చేస్తారు.
కానీ చాలామంది అసలైన, నాణ్యమైన వెంట్రుకలతో తయారైన విగ్గులు, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ని వాడడానికి ఇష్టపడతారు. వీరి వాటా మొత్తం మార్కెట్లో 30 శాతం ఉంటుంది. వీరికి కావలసిన నాణ్యమైన, అసలైన వెంట్రుకలు దొరికే ఏకైక దేశం భారత్. అందుకే భవిష్యత్తులో ఇండియన్ హెయిర్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
కేంద్రం ఏం చేయాలి:
హెయిర్ ఇండస్ట్రీని కూడా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో చేర్చడం గురించి ఆలోచించాలి. ఇప్పటివరకు కేవలం రా మెటీరియల్ లేదా శుద్ధి చేసిన మెటీరియల్‌నే ఎగుమతి చేస్తున్న ఇండియా.. పూర్తి స్థాయిలో హెయిర్ ప్రాడక్ట్స్‌ను తయారు చేసే పరిశ్రమల స్థాపనపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే కేవలం హెయిర్ ఎక్స్‌పోర్టర్‌గా ఉన్న ఇండియా.. భవిష్యత్తులో ప్రపంచ హెయిర్ ప్రాడక్ట్ మార్కెట్లోనూ తన ముద్ర వేయగలుతుంది.
అప్పుడు ప్రపంచ హెయిర్ మార్కెట్లో భారత్ టాప్ ప్లేస్‌కు చేరుకున్నా ఆశ్యర్యం అవసరం లేదు. ఇప్పుడు మీకో ప్రశ్న. తిరుమల తిరుపతికి మీరు ఎన్నిసార్లు వెళ్లారు..? ఎన్నిసార్లు తల వెంట్రుకలు సమర్పించారు..? తిరుపతి కాకుండా వేరేచోట్ల కూడా మొక్కు తీర్చుకున్నారా..? ఈ విషయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఈ స్టోరీపై మీ విలువైన సలహాలు, సూచనలు కూడా తెలియజేయండి.
#Tirupati #HaiIndustry #MakeInIndia #WorldNumberTwo