

Pandemic Wealth | కరోనాతో ప్రపంచం ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలే ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచంలోని ధనవంతులు బాగానే లబ్దిపొందారట.
ఇంతకుముందు ప్రపంచ సంపదలో ఒక శాతం వీళ్లదగ్గర ఉండేది. కానీ ఇది ఈ కరోనా కాలంలో 3.5 శాతానికి పెరిగిందట. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఎకనామిస్టు థౠమస్ పికెట్టి స్థాపించిన ఒక బృందం వెల్లడించింది. ప్రపంచంలో ఉన్న సుమారు 2,750 మంది బిలియనీర్లు ప్రపంచ సంపదలో సుమారు 3.5 శాతాన్ని కంట్రోల్ చేస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
1995లో ఇది కేవలం ఒక శాతంగానే ఉండేదట. అయితే కరోనా కాలంలో వీరి సంపద చాలా వేగంగా పెరిగిందని ఈ బృందం గుర్తించింది. అదే సమయంలో ప్రపంచంలోని బీదవాళ్ల వద్ద కేవలం 2 శాతం సంపద మాత్రమే ఉంది. ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత పెద్ద ఆరోగ్య సంక్షోభం కరోనా. ఈ సమయంలో ప్రపంచంలో అసమానతలు భారీగా పెరిగాయంటూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

వీటికి తాజా సర్వే మరింత బలం చేకూరుస్తోంది. కరోనా సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాల కన్నా, చెందుతున్న దేశాలపైనే ఎక్కువ ప్రభావం చూపింది. ఈ దేశాల్లోనే అసమానతలు కూడా బాగా పెరిగాయి. ఈ ధనిక రంగంలో కూడా ఆర్థిక, రియల్ ఎస్టేట్ మార్కెట్లు అత్యంత ఎక్కువ లాభాలు చవిచూశాయి.
గతేడాది బాగా దెబ్బతిన్న ఇవే రంగాలు ఇప్పుడు కాసులు కురిపిస్తున్నాయి. కరోనా సంక్షోభంలో ధనికులు మరింత ధనికులుగా మారడానికి తరతరాలుగా ఆయా దేశాలు ఏర్పాటు చేసుకున్న పాలసీలే కారణమని ఈ నివేదిక సహరచయితల్లో ఒకరైన లూకాస్ ఛాన్సెల్ అభిప్రాయపడ్డారు. కరోనా కన్నా ముందే ఈ ప్రపంచంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, అప్పుడు అమల్లో ఉన్న విధివిధానాల వల్ల ఈ మహమ్మారి సమయంలో అసమానతలు మరింత పెరిగాయని చెప్పారు.
అంతేకాదు, కరోనా సమయంలో కనీసం 100 మిలియన్ల మంది ప్రజలు పేదరిక రేఖ దిగువకు పడిపోయారని ప్రపంచ బ్యాంకు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే సమయంలో బిలియనీర్లు మాత్రం సుమారు 4.1 ట్రిలియన్ డాలర్లు సంపాదించినట్లు వెల్లడించారు. ప్రపంచంలోని చాలా చోట్ల ఆయా దేశాల్లోని పది శాతం ధనికుల చేతుల్లోనే 60 నుంచి 80 శాతం సంపద ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

అయితే పేద దేశాలు నెమ్మదిగా ఆర్ధికంగా పుంజుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ, ఈ దేశాల్లో కూడా ప్రజల మధ్య అసమానతలు మరింత వేగంగా పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన అసమానతల్లో.. ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నమోదైన అసమానతలే మూడో వంతు ఉన్నాయి.
2000వ సంవత్సరంలో ఈ అంతరాలు దీనిలో సగానికే ఉన్నట్లు సమాచారం. లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్య) దేశాల్లో ఈ అసమానతలు, అంతరాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లోని 75 శాతం సంపద కేవలం పదిశాతం ధనికుల చేతుల్లోనే ఉంది. అలాగే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలు కూడా.. ‘మిస్సింగ్ మిడిల్ క్లాస్’ (మధ్యతరగతి అనేది లేకపోవడం) వంటి సమస్యలతో బాధపడుతున్నాయి.
ఈ దేశాల్లో మధ్యతరగతి వర్గం కనుమరుగవుతోంది. ఈ మధ్యతరగతిలో అధికభాగం పేదవారిలో కలిసిపోతోందని అధ్యయనంలో తేలింది. ఈ విషయాలన్నీ తమ నివేదికలో పేర్కొన్న ఛాన్సెల్.. ‘బ్రిటిష్ వారి పాలనలో.. కలోనియల్ అసమానతలు ఉండేవి. ఇప్పుడు ఇవి మార్కెట్ అసమానతలతో భర్తీ అయ్యాయి. అసమానతలు మాత్రం తగ్గలేదు’ అని పేర్కొన్నారు.