Masks for Children | మాస్కులు పిల్లలకు డేంజర్..?

Masks for Children

Masks for Children: పిల్లలకు మాస్కులు ప్రమాదకరమా..? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పట్టిపీడిస్తోంది. నిజానికి తమ ముఖాలు కప్పుకొని తిరగడం పిల్లలకు అసలు నచ్చదు. అందుకే చాలా దేశాల్లో చిన్నారులు స్కూల్ నుంచి ఇంటికి వచ్చీరాగానే మాస్కు విసిరి పారేస్తున్నారు. పెద్దవాళ్లయినా అంతే అనుకోండి. కానీ పెద్దవాళ్లకు మాస్కు ఎందుకు ధరిస్తున్నాం? దాని ప్రయోజనాలేంటి? అనే ఆలోచన ఉంటుంది
. కానీ చిన్నారులకు అంత పెద్ద ఆలోచనలు రావు. దీంతో చిరాకు ఎక్కువైపోతోందని కొందరు నిపుణులు అంటున్నారు. అంతేకాదు శిశువులు పది నెలల వయసు నుంచే తమ చుట్టూ ఉన్న వారి ముఖకవళికలు, స్వర స్థాయులు గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ గ్రహించడం అనేది ఆరు, ఏడు సంవత్సరాల వయసులో చాలా ఎక్కువగా ఉంటుందట.
పిల్లల్లో ఫీలింగ్స్ తగ్గిస్తాయా..?
ప్రస్తుతం కరోనా భయంతో అందరూ మాస్కులు వేసుకోవడం వల్ల పిల్లల్లో భావోద్వేగ జ్ఞానం తగ్గిపోతుందని కొందరు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో పెద్దవాళ్ల పెదవుల కదలికను గమనించడం ద్వారానే పిల్లలు మాట్లాడటం నేర్చుకుంటారని, మాస్కుల వల్ల ఈ అవకాశం పోతుందని హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా భయంతో వీటన్నింటినీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా మాస్కులు ధరించడంపై కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆరేళ్లు దాటిన పిల్లలు కూడా మాస్కు ధరించాలని సూచించింది. అమెరికా సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మరో అడుగు ముందుకేసీ రెండేళ్లు దాటిన పిల్లందరూ కూడా మాస్కు ధరించాలని వెల్లడించింది. ఒకానొక తరుణంలో పిల్లలకు మాస్కులు అక్కర్లేదనే చాలా దేశాలు భావించాయి.
కానీ డెల్టా వేరియంట్ ఎంత వేగంగా ప్రబలిందో చూసిన తర్వాత దేశాలు వణికిపోయాయి. అందుకే సింగపూర్ వంటి దేశాలు కూడా చిన్నారులకు మాస్కు కంపల్సరీ చేశాయి. ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు కూడా ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆరేళ్ల వయసున్న పిల్లలు కూడా మాస్కులు ధరించాలని చెప్పాయి. అలాగే స్కూళ్ల వంటి ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కొన్ని దేశాలు సూచించాయి. యూకే వంటి దేశాల్లో స్కూళ్లకు వచ్చే టీచర్లు, విద్యార్థులు మాస్కు కచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదు. కానీ బయట మాత్రం మాస్కు తప్పనిసరి.
2ఏళ్ల వయసున్న వారికి అవసరంలేదా..?
ఈ విషయంలో ప్రపంచం మొత్తం అంగీకరించిన రూల్ ఒకటే.. పసివాళ్లు, రెండేళ్ల కన్నా తక్కువ వయసున్న వాళ్లకు మాస్కు అక్కర్లేదని. దీనికి కారణం మాస్కు వేసుకుంటే వాళ్లకు ఊపిరి సరిగా అందక ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయంలో శాస్త్రీయంగా ఫలానా వయసు ఉన్న వాళ్లే మాస్కు ధరించాలనే ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.

కొన్ని దేశాల్లో ఇలా చిన్నారులు మాస్కు ధరించడం వల్ల ఏమైనా నష్టం ఉందా? అని పరిశోధనలు కూడా జరిగాయి. ముఖ్యంగా వారికి ఊపిరితీసుకోవడం వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయా? అనే అంశంపైనే ఈ పరిశోధనలు ఫోకస్ పెట్టాయి. వీటి ప్రకారం మాస్కు ధరించడం వల్ల శారీరకంగా ఎటువంటి సమస్యా లేదు. మాస్కు వేసుకుంటే మనకు కరోనా రాకుండానే కాదు, అది ఇతరులకు సోకకుండా కూడా అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించేందుకు మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. ఇటీవలి కాలంలో పెద్దవాళ్లంతా వ్యాక్సిన్లు తీసుకొని మాస్కు తప్పనిసరి నిబంధన నుంచి కొంత సడలింపు పొందుతున్నారు. కానీ పిల్లల పరిస్థితి అలా లేదు. చాలా దేశాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. అంటే వాళ్లు కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మాస్కు కంపల్సరీ. అయితే చిన్నారుల్లో కరోనా తీవ్రత మాత్రం పెద్దగా కనిపించలేదు.
సర్వేలు ఏం చెబుతున్నాయి..?
ఒక సర్వే ప్రకారం, కరోనా సోకిన 50 వేలమందిలో ఒక్క చిన్నారికి మాత్రమే ఐసీయూలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే పది లక్షల మందిలో ఒకరు మాత్రమే మరణిస్తున్నారు. కానీ డెల్టా వంటి వేరియంట్ల కారణంగా వారికి కూడా మాస్కులు తప్పనిసరి అయిపోయాయి. అయితే మాస్కులు ధరించడం వల్ల కరోనా కేసులు నమోదవడం తగ్గిందని మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన చాలా అధ్యయనాలు వెల్లడించాయి.

కరోనాతో అల్లాడిన దేశాల్లో ఒకటైన యూకేలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక స్కూల్లో మాస్కులు ధరించడం వల్ల అక్కడ కరోనా వ్యాప్తి 37 శాతం తగ్గిందట. అంతేకాదు సుమారు 7వేల మంది హాజరయ్యే ఒక స్కూల్లో అందరూ మాస్కులు ధరించడం వల్ల కేవలం 363 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయట. అంటే కరోనా వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు ఎంతో కొంత సక్సెస్ సాధించినట్లే.
నో ప్రాబ్లెమ్:
అలాగే మాస్కులు ధరించడం వల్ల చిన్నారులకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. భాష, భావోద్వేగాలు తెలుసుకోవడానికి ఇతర అంశాలపై వాళ్లు ఆధారపడతారని, దీనివల్ల సమస్యేమీ ఉండదని వాళ్లు వివరిస్తున్నారు.

చైనా, జపాన్ వంటి దేశాల్లో ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు మాస్కులు ధరించడం ఎప్పటి నుంచో జరుగుతున్నా.. అక్కడి చిన్నారులు బాగానే ఎదుగుతున్నారు కదా అని ఉదాహరణలు చూపుతున్నారు. కాబట్టి ఈ కరోనా పోయే వరకూ అందరూ మాస్కులు ధరించడమే బెస్ట్.