

Journalism | చరిత్రలో చాలా సార్లు జర్నలిస్టులు జైలు ఊచలు లెక్కపెట్టారు. కానీ ఈసారి ఆ రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది జర్నలిస్టుల చరిత్రలో చీకటి ఏడాదిగా మిగిలింది. ఈ విషయాన్ని జర్నలిస్టుల రక్షణ కమిటీ (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) వెల్లడించింది. ఈ కమిటీ (సీపీజే) నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో అత్యధికంగా 293 మంది జర్నలిస్టులు జైలుపాలయ్యారట.
ఇంత సంఖ్యలో జర్నలిస్టులు జైల్లో పడటం ఇదే తొలిసారి. అంతేకాదు సుమారు 24 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ‘అత్యధికంగా చైనాలో జర్నలిస్టులను జైల్లో వేశారు. ఇక్కడ మొత్తం 520 మంది జర్నలిస్టులు జైలుపాలయ్యారు’ అని ఈ నివేదిక తెలిపింది. ఇలా వార్తలు అందిస్తున్న జర్నలిస్టులను జైల్లో వేయడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని సీపీజే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జో సైమన్ అన్నారు.
అలాగే మయన్మార్, ఇథియోపియా వంటి దేశాలు పత్రికా స్వేచ్ఛకు పూర్తిగా ద్వారాలు మూసివేయడం షాకింగ్ నిర్ణయమని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ నివేదిక ప్రకారం, జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశాలుగా భారత్, మెక్సికో నిలిచాయి. ఈ ఏడాదిలో జరిగిన 24 మంది జర్నలిస్టుల హత్యల్లో నాలుగు భారత దేశంలోనే జరిగాయి.
ఈ ఏడాది అత్యధిక జర్నలిస్టులు హత్యకు గురైంది మన భారత్‌లోనే కావడం గమనార్హం. మరో మూడు మెక్సికోలో జరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే మెక్సికోలో మరో ఆరుగురు జర్నలిస్టుల హత్యలపై విచారణ జరుగుతోందని తెలిపింది.