Indian Army | కల్నల్ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’


Indian Army: అమరవీరుడు కల్నల్ సంతోష్‌బాబును కేంద్ర ప్రభుత్వం మహావీర చక్రతో సత్కరించింది. 2020 జూన్ 15న శత్రు సైనికులతో పోరాడుతూ సంతోష్ బాబు ప్రాణాలొదిలారు. చైనా పీఎల్‌ఏ ఆర్మీ దొంగ దెబ్బ తీసినా.. దేశం కోసం, తోటి వారి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు సంతోష్‌బాబు. వాస్తవాదీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో జరిగిన ఈ పోరాటంలోనే ఆయన వీరమరణం పొందారు.
కల్నల్ సంతోష్‌బాబు వీరత్వాన్ని, దేశం కోసం ప్రాణాలు వదిలిన ఆయన త్యాగాన్ని గౌరవిస్తూ.. జనవరిలో మహావీరచక్ర అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఆయన సతీమణి సంతోషి, తల్లి మంజుల.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు.కాగా.. లఢఖ్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

18 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు.చైనా పీఎల్‌ఏ బలగాలు దేశంలోకి చొరబడకుండా తరిమికొట్టి.. వారి దురాక్రమణను నిరోధించడంలో కల్నల్ సంతోష్ బాబు ఎంతో ధైర్యసాహసాలను చూపారు. వీరోచితంగా పోరాడి చివరికి ప్రాణాలను సైతం వదిలారు. దేశం కోసం అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు దేశం మొత్తం అశృనివాళి అర్పించింది.
దేశ రక్షణ కోసం ఆయన చూపిన తెగువ, ఓ వైపు ప్రాణాలు పోతాయని తెలిసినా.. సరిహద్దుల్లో శత్రు సైన్యంతో పోరాడిన ఆయన ధైర్య సాహసాలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోతు. సెల్యూట్ సంతోష్‌బాబు.ఇదిలా ఉంటే ఈ ఘర్షణల్లో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. చైనా తరఫున 50 మందికి పైగా పీఎల్ఏ సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు. ఆ తర్వాత ఓ 20 మంది మరణించారని వెల్లడించింది.