అభినందన్ వర్ధమాన్ ను ‘వీరచక్ర’తో సత్కరించిన కేంద్రం


Abhinandan Vardhaman: అభినందన్ వర్ధమాన్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ఎయిర్‌ఫొర్స్‌లో ఓ తురుపుముక్క. వింగ్ కమాండర్‌గా అభినందన్ ధైర్యసాహసాలు అద్భుతం. పాకిస్తాన్ సైన్యానికి చిక్కినా బెదురు లేకుండా నిలబడిన సాహసవంతుడాయన. అంతటి సాహసవీరుడిని కేంద్ర ప్రభుత్వం తాజాగా సత్కరించింది.
‘వీరచక్ర’ అవార్డును అందించి అభినందించింది. 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత వాయుమార్గంలోకి ప్రవేశించాయి. ఇది గమనించిన భారత వాయుసేన వారిని వెనక్కి తరిమింది. అందులో వింగ్ కమాండర్ అభినందన్ కూడా ఉన్నారు. ప్రత్యర్థులవి అత్యాధునిక విమానాలని తెలిసినా.. ఆయన వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా పాకిస్తాన్ భూభాగం వరకు వెంటపడి తరిమారు.
మిగతా వారంతా వెనక్కి వచ్చేసినా.. అభినందన్ మాత్రం వెనక్కి రాలేదు. తన పాత మిగ్-21 బైసన్‌తో పాకిస్తాన్ అత్యాధునిక ఎఫ్-16ను వెంబడించారు. ఆ విమానం తన రాడార్‌లోకి రాగానే దాన్ని కూల్చేశారు. అయితే అదే సమయంలో మరో పాక్ జెట్ వెనుక నుంచి దాడి చేయడంతో ఆయన విమానం పాకిస్తాన్‌లో కూలింది.
అక్కడి నుంచి పాకిస్తాన్ సైత్యం ఆయనను ఎత్తుకెళ్లి చిత్ర హింసలు పెట్టింది. అయినా బెదురు లేకుండా నిలబడ్డారు. భారత ప్రభుత్వ చొరవతో ధైర్యంగా తిరిగొచ్చారు. భారత సైన్యం ధైర్యసాహసాలకు ఓ నిదర్శనంగా నిలిచిన అభినందన్ ధీరత్వాన్ని యావత్ భారతం ప్రశంసించింది.