National Anthem | జనగణమన మర్చిపోతున్నారా..?


National Anthem | ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ విరివిగా వాడుతున్న కాలంలో విద్యార్థులు, యువత వాటికే సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ ఎంతో కష్టపడి స్వాతంత్య్రం తెచ్చిన మహా యోధుల గురించి, దేశమంతా ఒకటే అని చాటిచెప్పే జాతీయ గీతం గురించి కొంతమంది మాత్రం మర్చిపోతున్నారు.
కరోనా కష్టకాలంలో స్కూల్స్ కూడా లేకపోవడంతో రోజూ స్కూల్ లో ఉండే ప్రేయర్ కూడా లేకపోవడం, దీంతో విద్యార్థులు క్రమంగా జాతీయ గీతం గురించి మర్చిపోవడం జరుగుతుంది.

కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు, ఫోన్ లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు తప్పించి, దేశం గురించి కానీ, దేశభక్తి గురించి కానీ, జాతీయ గీతం గురించి కానీ తెలుసుకోవడమే మానేశారు.
భారత దేశ జాతీయ గీతం జనగణమన ను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాసినా, ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీద దాన్ని ఆలపించారు.
కానీ ఇప్పుడు మనం వినే ట్యూన్ లో కాదు, అప్పట్లో ఈ గీతాన్ని ఎవరికి నచ్చిన ట్యూన్ లో వాళ్లు రాగం కట్టుకుని పాడుకునేవాళ్లు. జనగణమనకు ఆ ట్యూన్ ని ఇచ్చింది ఐరిష్ జాతీయురాలైతే, దానికి వేదికైంది మాత్రం చిత్తూరు జిల్లా మదనపల్లె.
అలాంటి మన తెలుగు ప్రాంతంలో ట్యూన్ అయిన జాతీయ గీతం గురించి, దాని ప్రాధాన్యత గురించి అసలు ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఈ జాతీయ గీతాన్ని సరిగ్గా పాడగలుగుతున్నారు? ఏదో సంవత్సరానికోసారి వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజు మేరా భారత్ అని మనలో ఉన్న దేశ భక్తిని బయటపెడితే చాలులే అనుకునే పరిస్థితికి వచ్చింది నేటి సమాజం.
మరి ఇలాగే ఉంటే జాతీయ గీతం గురించి, దాని ప్రాముఖ్యత గురించి లోకానికి తెలిసేదెలా? నానాటికీ జాతీయ గీతం గురించి అవగాహన లోపిస్తే, మరి రేపటి తరానికి అసలు జాతీయ గీతం గురించి ఎలా తెలుస్తుంది అని ఆలోచించేదెవరు?
ఎంతోమంది దీని గురించి ఆలోచించి తమ తమ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ అది పూర్తి స్థాయిలో సఫలం అవట్లేదు.
ప్రతీరోజూ జాతీయ గీతం:
ప్రతీరోజూ జాతీయ గీతాన్ని ఆలపించే ఊరుగా చిత్తూరు జిల్లా పుంగనూరుకు దేశంలోనే ప్రత్యేకస్థానం ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో అసలు జాతీయ గీతం అంటే అదేదో సాధించిన వారికి మాత్రమేలే అనుకునే పరిస్థితి నెలకొంది.
ఈ జాతీయ గీతం గురించి అందరికీ అవగాహన పెంపొందించాలని ఆలోచించిన వారిలో మన తెలుగు తేజం తుమ్మల నరేంద్ర చౌదరి కూడా ఒకరు.
దేశంలోని అన్నీ నేషనల్ ఛానెల్స్ కంటే ముందే ఎన్టీవీ తరఫున ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టి మన దేశం- మన గీతం అనే కార్యక్రమం పేరట సుమారు 105 చోట్ల ప్రతి కార్యక్రమంలో కనీసం వేల మందితో కలిసి జనగణమన పాడి, ఈ జాతీయ గీతం గురించి మరింత అవగాహన పెంచేలా చేశారు.
స్వయంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటూ, ఆనాటి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనేలా చేసి, చాలా తక్కువ కాలంలోనే ఈ బృహత్తర కార్యం ద్వారా జాతీయ గీతం ప్రాముఖ్యతను తెలిసేలా చేశారు.
#NTV #NationalAnthem #RabindernathTagore #TummalaNarendraChowdary