

Smoking | సిగరెట్, బీడీ, ఖైనీ, జర్దా, పాన్.. మెటీరియల్ ఏదైనా.. ఏ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి డేంజరే. ఒకవేళ పొగ తాగే వాళ్లకి కానీ, ఖైనీ, జర్దాలు తీనేవాళ్లకి కానీ.. ‘బాబూ ఇది ప్రమాదం. పొగాకు వదిలేయండి’ అని చెబితే.. మనల్ని ఓ రకంగా చూసి ‘మాకు తెలుసులే’ అంటారు. ఇంకొంతమంది ‘తెలుసండీ. కానీ వదిలిపెట్టలేకపోతున్నా. ఇది లేకపోతే.. మైండ్ పనిచేయట్లేదు’ అని చెబుతుంటారు. ఇలా తెలియకుండానే పొగాకుకు బానిసలైపోతుంటారు చాలామంది. దీనికి కారణం పొగాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం. ఇది మన మెదడులో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మన మెదడు రిలాక్స్ ఫీల్ అవుతుంది. అలా టైం గడిచేకొద్దీ.. ఆ రిలాక్స్‌ని మళ్లీ మళ్లీ అనుభవించాలనిపిస్తుంది. అక్కడే పొగాకుకు బానిసలుగా మారిపోతారు.
కాఫీ, సిగరెట్ ఒకటేనా..?

మనం తాగే కాఫీలో ఉండే కెఫీన్ కూడా నికోటిన్‌లానే పని చేస్తుంది. అయితే రోజూ కాఫీ తాగినా ఏం కావడం లేదు కదా..? అప్పుడు సిగరెట్ వల్ల ఏమవుతుంది..? అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఓ చిన్న తేడా ఉంది. అదేంటంటే.. పొగాకు తీసుకునే విధానం. కాఫీని ఉడకబెట్టి తీసుకుంటాం. దీనివల్ల అందులోని టాక్సిన్స్ చాలా వరకు నాశనం అయిపోతాయి. కానీ పొగాకు అలా కాదు. దాన్ని కాల్చినప్పుడు, లేదా నేరుగా తింటున్నప్పుడు.. దాని నుంచి టాక్సిక్ గ్యాసెస్, టాక్సిక్ లిక్విడ్స్.. అంటే విషవాయువులు, విష పదార్థాలు విడుదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్.. పొగాకులో ఉండే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో కలవడం వల్ల ఎర్ర రక్త కణాల సైజు పెరిగి.. వాటి ప్రవాహ వేగం తగ్గిపోతుంది. అలాగే ఈ పొగ వల్ల శరీరంలో విడుదలయ్యే ఎపినఫెరిన్, నాన్ ఎపినోఫిరిన్ హార్మోన్లు హార్ట్ రేట్‌ను పెంచేస్తాయి. రక్త నాళాలను కృశింపజేస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
24 గంటల్లో:

ఇదంతా తెలిసిన తర్వాత ఎవరైనా.. గట్టిగా ఓ నిర్ణయం తీసుకుని పొగాకు వదిలేయాలని అనుకున్నారే అనుకుందాం. అలా అనుకుని సిగరెట్ వదిలేస్తే.. కేవలం 8 గంటల్లోనే వారి శరీరంలో ఉండే విష పదార్థాల క్లీనింగ్ ప్రాసెస్ మొదలైపోతుంది. అన్నింటికంటే ముందు రక్తకణాల సైజు తగ్గి.. ఆక్సిజన్‌ను తీసుకెళ్లే కెపాసిటీ పెంచుకుంటాయి. హార్ట్ రేట్ కూడా సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. కానీ 24 గంటలు గడిచేసరికి పొగాకు వల్ల అప్పటివరకు మనల్ని రిలాక్స్ చేసిన డోపమైన్ విడుదల ఆగిపోతుంది. దీంతో మెదడు మనల్ని పొగాకు తీసుకోవాలని బలవంతం చేస్తుంది.
48 గంటల్లో:

ఒకవేళ మనం అప్పటికీ మనం పొగాకుకు దూరంగా ఉంటే.. 48 గంటల తర్వాత శరీరంలో కొత్త కొత్త మార్పులొస్తాయి. అప్పటివరకు దెబ్బ తిన్న రక్తకణాలు, నరాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం మొదలవుతుంది. దానివల్ల మన శరీరంలో టాక్సిన్స్ నెమ్మదిగా బయటకు వెళ్లిపోతాయి. అప్పటివరకు ప్రతి రోజూ తింటున్న ఆహారమే మరింత రుచికరంగా అనిపిస్తుంది. అంటే రుచిని గ్రహించే శక్తి పెరుగుతుంది.
72 గంటల్లో:

72 గంటలు గడిచేసరికి డోమపైన లేకపోవడం వల్ల నికోటిన్ కావాలనే కోరిక తీవ్రమవుతుంది. డోపమైన కోసం మెదడే మన శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. ఒకపక్క కొత్త రక్త కణాల సంఖ్య పెరుగుతూ నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తున్నా.. శరీరం మాత్రం ఏ పనికీ సహకరించకుండా.. ఒత్తిడికి లోనవుతుంది. కొంతమందిలో చేతులు, కాళ్లు వణుకుతాయి. తల తిరుగుతుంది. వాంతులవుతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ.. వంటి సమస్యలన్నీ ఒక్కసారిగా వస్తాయి. ఆ టైంలో ‘ఒక్క సిగరెట్’ ఉంటే చాలనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితిని తట్టుకోగలిగితే.. డోపమైన లేకపోయినా తట్టుకోగలిగే స్థితికి మెదడు చేరుకుంటుంది. అప్పుడు అసలైన రిలాక్సేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓ నెల రోజులు గడిచేటప్పటికి మన శరీరం పూర్తిగా మారిపోతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. డయాబెటీస్, గుండె సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ఇదేదో అంచనా వేస్తున్న థియరీ కాదు.. కచ్చితంగా ప్రయోగాత్మకంగా తెలుసుకున్న నిజాలు.
ప్రపంచ స్మోకర్స్ లెక్క:

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 130 కోట్లమందికి పైగా పొగ తాగేవాళ్లున్నారు. వీళ్లే కాక వేరే పద్ధతుల్లో పొగాకు తీసుకునేవాళ్ల లెక్క మళ్లీ సెపరేట్‌గా ఉంది. అంటే దాదాపు 150 కోట్ల మందికి పైగా ఈ పొగాకుకు బానిసగా ఉన్నారు. వీళ్లలో ఎంతోమంది క్యాన్సర్, హార్ట్ ఎటాక్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారంతా ఒక్కసారి
స్మోకింగ్ అలవాటును వదలేయడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ ఓ చిన్న సలహా.. స్మోకింగ్ వదిలేయాలనుకునేవాళ్లు.. ‘నేను స్మోకర్‌ని. అది నా అలవాటు. ఇప్పుడు ఆ అలవాటును బలవంతంగా వదిలేయాలనుకుంటున్నా’ అని అనుకోకండి. ‘నాకు స్మోకింగ్ అలవాటు అనుకోకుండా వచ్చింది. దాన్ని వదిలించుకోవాలి’ అని అనుకోండి’ కచ్చితంగా మీరు ఆ చెడ్డ అలవాటును వదిలించుకోగలుతుగారు.
#Smoking #Nicotin #Cafine #Vira
1 thought on “Smoking | స్మోకింగ్ వదిలేస్తే 3 రోజుల్లో పిచ్చి పడుతుందా..?”