Danger Diseases | ముదిరితేకానీ తెలియవు.. ఈ వ్యాధుల గురించి తెలుసా?


ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనం చాలా వ్యాధులకు టార్గెట్‌గా మారిపోతున్నాం. వీటిలో కొన్ని వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కొన్ని వ్యాధులు మాత్రం ప్రమాదకరంగా మారినప్పుడే వాటి ఉనికిని గుర్తించగలుగుతాం. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది.
వాటిని తగ్గించుకోవడానికి నానా తిప్పలూ పడాల్సి వస్తుంది. కొన్నయితే అసలు తగ్గవు కూడా. వీటిలో కొన్ని వ్యాధులు ఒక్కోసారి మన ప్రాణాలు కూడా తీసేయగలవు. అలాంటి వ్యాధులను ‘సైలెంట్ కిల్లర్స్’ అంటారు. వాటి గురించి తెలుసుకొని అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
1. అధిక రక్తపోటు
ప్రపంచంలో చాలా మందికి హైబీపీ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనాల ప్రకారం ప్రపంచంలో 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 1.3 బిలియన్ల మందికి ఈ వ్యాధి ఉందట. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే.. ఈ వ్యాధి ప్రమాదకరంగా మారే వరకూ దీని లక్షణాలు బయటపడవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. హైబీపీ పెరిగితే గుండె, ధమనులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు: పొటాషియం, ఫైబర్, ప్రొటీన్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తరచుగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉప్పు తగ్గించుకోవాలి. మందు, సిగరెట్ వంటి అలవాట్లు వదిలేసుకోవాలి. వ్యాయామం చేస్తూండాలి.
2. కరోనరీ ఆర్టరీ వ్యాధి
ప్రాణాంతకమైన గుండె జబ్బుల్లో ఇది ఒకటి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కుచించుకుపోవడాన్ని కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటారు. దీనివల్ల ఛాతీనొప్పి, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అదే గుండెపోటు తీవ్రంగా వస్తే చాలా ప్రమాదం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో తగిన మార్పులతో ఈ వ్యాధిని దూరం పెట్టొచ్చు. కానీ ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించడం ముఖ్యం. అయితే ఇలా త్వరగా వైద్యం అందించినా కూడా రోగుల్లో హార్ట్ ఫెయిల్యూర్, అరిథ్మియా వంటి సమస్యలు తలెత్తవచ్చు.
జాగ్రత్తలు: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు, హైబీపీ సమస్య ఉన్న వ్యక్తులు తరచూ చెకప్‌లు చేయించుకుంటే మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సిగరెట్, మందు మానుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
3. మధుమేహం
డయాబెటీస్ వచ్చే ముందు గుర్తించడం కష్టం. అది వచ్చేశాకే లక్షణాలు బయటపడతాయి. అలసట, బరువు తగ్గడం, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి ఏదో వ్యాధి వల్ల వచ్చాయని చాలా మంది అనుకోరు. దీంతో డయాబెటీస్ బాగా ముదిరిన తర్వాత బయటపడుతుంది. దీనివల్ల గుండె, మూత్రపిండాలు, కంటిచూపు సమస్యలు వస్తాయి.
జాగ్రత్తలు: ఎప్పటికప్పుడు డయాబెటీస్ చెకప్ చేయించుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి.
4. ఆస్టియోపొరోసిస్
ఆస్టియోపొరోసిస్‌ను తెలుగులో చెప్పుకుంటే ‘బోలు ఎముకల వ్యాధి’ అని అంటారు. ఇది వచ్చినా కూడా త్వరగా లక్షణాలు బయటపడవు. ఎముకల సాంద్రత దెబ్బతిని, గుల్లగా మారతాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాలమీదకు వస్తుంది.
జాగ్రత్తలు: కాల్షియం, విటమిన్ డి ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం వంటి పనులు చేస్తుండాలి.
5. స్లీప్ అప్నియా
ఈ వ్యాధి ఉన్నవారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధిగ్రస్థులు నిద్రపోతూ ఊపిరి తీసుకునేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. విపరీతంగా గురక పెడతారు. పగలంతా బాగా అలసటగా ఉంటుంది.
జాగ్రత్త: ఆరోగ్యకరమైన జీవనశైలి దీనికి చక్కటి ఔషధం. సిగరెట్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే డాక్టరును కలిసి వ్యాధి తీవ్రతను తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి.
6. ఫ్యాటీ లివర్ వ్యాధి
కాలేయానికి సంబంధించిన ఈ వ్యాధి కూడా తీవ్రమయ్యే వరకూ బయటపడదు. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి మద్యపానం వల్ల వస్తుంది. రెండోది ఎందుకు వస్తుందో ఇంకా శాస్త్రవేత్తలకే తెలియలేదు. ఈ వ్యాధి ముదిరిందంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది.
జాగ్రత్తలు: ఆరోగ్యకరమైన ఆహారం చాలా కీలకం. ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండాలి.
పలు అధ్యయనాలు, పరిశోధనల్లో నిపుణులు ఈ వివరాలను వెల్లడించారు. ఈ సైలెంట్ కిల్లర్ వ్యాధులపై ఎటువంటి సందేహాలున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలి.