

Covid and Aids | కరోనా వైరస్ మనల్ని అప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్ అంటూ రకరకాల వేరియంట్లలో మన ప్రాణాలు తోడేస్తున్న ఈ వైరస్ ఇప్పుడు సరికొత్త మార్పు తీసుకుంది. కోవిడ్ వైరస్‌లో శాస్త్రవేత్తలు కొత్తగా బీ 1.1.529 నే వేరియంట్‌ను కనుగొన్నారు. ఇది మిగతా వాటన్నింటికంటే ప్రమాదకరమైనది, అలాగే దీని వ్యాప్తి కూడా ఇప్పటివరకు వచ్చిన అన్ని వేరియంట్లకంటే రెట్టింపు వేగం ఉంటుందని అంచనా. ఇదంతా ఓ ఎత్తయితే ఈ కొత్త వేరియంట్ ఎక్కడి నుంచి వచ్చింది..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఈ బీ 1.1529 వేరియంట్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగిలో పుట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
లండన్‌లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. బి.1.1.529 వేరియంట్‌ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వేరియంట్ ఎలా పుట్టింది..? ఎక్కడ పుట్టింది..? అనేదానిపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగిలో ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉండొచ్చంటున్నారు. ఇక ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడి వారిని దాదాపు 100 మంది వరకు గుర్తించారు.
పనిచేయని వ్యాక్సినేషన్:
అంతేకాదు.. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోందట. ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండడం ప్రపంచ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ వేరియంట్ వైరస్ సోకిన వారిలో అత్యధికశాతం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారేనట. ఇప్పటివరకు వినియోగించిన వ్యాక్సిన్.. కొత్త వేరియంట్‌పై ఏమాత్రం పనిచేయడం లేదని చెబుతున్నారు.
ఎలా ప్రవేశిస్తుంది..?
డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్‌లో మ్యుటేషన్లు చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించడంలో స్పైక్ ప్రొటీనే కీలకంగా పనిచేస్తుంది. అక్కడే అధిక మ్యుటేషన్లు ఉండటంతో ఈ వైరస్ డెల్టా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని వారాలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.
శాస్త్రవేత్తలు మాటేమిటి..?
‘ఇప్పటికే ఈ వేరియంట్ బారిన పడిన వారి రక్త నమూనాలను పరీక్షించడం జరిగింది. అందులో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. వారి రక్తంలో వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉందని నివేదికలు అందాయి. దీని వల్ల దక్షిణాఫ్రికాలో పాజిటివిటీ రేటు ఒక్క వారంలోనే 1శాతం నుంచి 30శాతానికి పెరిగింది. మ్యుటేషన్ల కారణంగా ఈ వేరియంట్ మునుపటి రకాల కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశముంది’ అంటూ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నారు.
కొత్త వేరియంట్ వచ్చిందని తెలియడంతో ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే జాగ్రత్తపడుతున్నాయి. అనేక దేశాలు తమ దేశంలోకి వచ్చే విదేశీయులపై కఠినమైన ఆంక్షలు విధించాయి. ఇప్పటికే యూకే, ఇజ్రాయెల్ వంటి దేశాలు.. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాతో పాటు ఇంకో 4 ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను ఆపేశాయి. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్ నిబంధనలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటు భారత్ కూడా కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.