

..స్కూల్‌పై రాళ్ల వర్షం కురిపించారు స్థానికులు. వారికి బజరంగ్ దల్ వాళ్లు కూడా చేయూతనందించారు. అంతేకాకుండా స్కూల్‌లోకి దూసుకుపోయారు. ఈ దాడి నుంచి పాఠశాల విద్యార్థులు అతి కష్టంపై తప్పించుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌లో సోమవారం చోటు చేసుకుంది. 12వ తరగతి విద్యార్థులు లెక్కల పరీక్ష కోసం కూర్చున్న సమయంలో ఒక్కసారిగా రాళ్ల దాడి ప్రారంభం అయింది. ఆ స్కూల్‌లో క్రిస్టియన్స్ విద్యార్థులను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని స్థానికులు, బజరంగ్ దళ్ వాళ్లు మూకుమ్మడిగా స్కూల్‌పై రాళ్ల వర్షం కురిపించారు. అయితే దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు స్కూల్ యాజమాన్యం ద్వారా మతమార్పిడికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
దీంతో స్థానికులు ఆగ్రహం పట్టలేక స్కూల్‌పై దాడి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గుంపుగుంపులుగా జనాలు స్కూల్‌పై రాళ్లు విసరడం మనం చూడొచ్చు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ గొడవ కారణంగా తాము ఏకాగ్రత కోల్పోయామని, కావున పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై స్కూల్ మేనేజర్ స్పందిస్తూ.. వార్తల ద్వారా స్కూల్ వద్ద ఉద్రిక్తతను తాను తెలుసుకున్నానని ఆయన చెప్పారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు సరైన రక్షణ కల్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానికుల ఫిర్యాదులోని విద్యార్థుల పేర్లలో ఏ ఒక్క పేరు కూడా తమ విద్యార్థులతో కలవడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బజరంగ్ దళ్ నాయకుడు మాట్లాడుతూ.. ఈ విషయంపై లోతైన దర్యాప్తు జరగాలని, మతమార్పిడిలో స్కూల్ హస్తం ఉందని తేలితే స్కూల్‌ను పడగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పోలీసులు అక్కడ ఉన్న ఇతర మిషనరీ స్కూళ్లకు రక్షణను పెంచారు.