
MovieTwist

MovieTwist | బయోపిక్‌లకు వెండితెరపై ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. దాన్ని చక్కగా తెరకెక్కిస్తే చాలు, ప్రేక్షకులు ఆ సినిమాల్లోని ఎమోషన్‌ను నిజంగా ఫీలవుతారు. ఇదే ఉద్దేశ్యంతో ‘లక్కీ’ అనే బయోగ్రఫీ పుస్తకంతో సినిమా తీయాలని కొందరు నిర్మాతలు అనుకున్నారు.
ఈ పుస్తకం రాసిన రచయిత్రి పేరు అలైస్ సెబాల్డ్. 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు.
ఈ కేసులో ఆంథనీ బ్రాడ్‌వాటర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనే తనను బలాత్కరించినట్లు ఆమె గుర్తించింది. దీంతో అతనికి 16 ఏళ్ల జైలుశిక్ష విధించారు. శిక్ష అనుభవించినంత కాలం తాను నిర్దోషినేనని ఆంథనీ వాదించాడు.

శిక్ష ముగించుకొని విడుదలయ్యాడు. కానీ ఒక రేపిస్ట్ అనే మచ్చ మాత్రం అతనిపై అలాగే ఉండిపోయింది. ఈ కేసు మొత్తాన్ని అలైస్ తన ‘లక్కీ’ అనే పుస్తకంలో పొందుపరిచింది. ఈ పుస్తకాన్ని సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్లో టిమోతీ ముసియాంటె అనే వ్యక్తి ఉన్నాడు. ఆ పుస్తకంలో కోర్టు సీన్‌లలో ఏదో తేడా ఉందని అతనికి అనిపించింది.
కోర్టు విచారణ ఎపిసోడ్ మొత్తం ఏదో అతికించినట్లు, భిన్నంగా ఉన్నట్లు అతను భావించాడు. దీంతో సినిమా నుంచి తప్పుకున్నాడు. అక్కడితో ఆగకుండా ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను నియమించి ఈ కేసుపై విచారణ చేయించాడు. ఈ దర్యాప్తులో ఆంథనీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని తేలింది.
కేవలం అలైస్ మాటలు, వెంట్రుకల మైక్రోస్కోపిక్ విశ్లేషణ ద్వారా అతన్ని నిందితుడిగా గుర్తించినట్లు తెలిసింది. అయితే వెంట్రుకల విశ్లేషణ సరైన ఫలితాలు ఇవ్వడం లేదనే కారణంగా నేరస్థులను గుర్తించే విధానాల నుంచి దీన్ని కొంతకాలం క్రితం తొలగించేశారు.
అంటే ఈ విశ్లేషణ సరైన ఫలితం ఇవ్వకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఎటువంటి ఆధారాలూ లేకుండా అతన్ని దోషిగా ఎలా తేలుస్తారని న్యూయార్క్ కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అతను దోషి కాదని తేల్చిచెప్పింది.

దీంతో ‘లక్కీ’ సినిమా తీయడానికి ముందుకొచ్చిన మరికొందరు నిర్మాతలు కూడా వెనుకడుగు వేశారు. అలైస్ దీనిపై స్పందిస్తూ.. ఆంథనీని క్షమాపణలు కోరింది. 18 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైన బాధితురాలిగా న్యాయవ్యవస్థపై నమ్మకముంచానని చెప్పింది.
న్యాయం కావాలనుకున్నానే తప్ప ఎవరికీ అన్యాయం చేయాలని తాను అనుకోలేదని తెలిపింది. అయితే ఆమె పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆమె చేసింది కచ్చితంగా తప్పేనని ఆంథనీ ఆవేదన వ్యక్తం చేశాడు.
#Biopic #Anthony #Alice #Lucky #MovieTwist