Shocking | రూ.300 తీసుకున్నాడని.. కారుతో తొక్కి చంపేశాడు!

Shocking

Shocking | రైలు టికెట్ బుక్ చేసుకొన్న ఒక వ్యక్తి.. సడెన్‌గా తన టికెట్ క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. దీంతో ఈ టికెట్ బుక్ చేసిన వ్యక్తి అతని వద్ద నుంచి క్యాన్సిలేషన్ చార్జి కింద రూ.300 వసూలు చేశాడు.
దీంతో కోపం తెచ్చుకున్న ఆ కస్టమర్.. తన కారుతో ఆ షాపు ఓనర్‌ను తొక్కి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
గ్రేటర్ నోయిడాలో నితిన్ శర్మ అనే 30 ఏళ్ల వ్యక్తి మొబైల్ ఫోన్లు అమ్ముతుంటాడు. అవసరమైన వాళ్లకు రైలు టికెట్స్ కూడా బుక్ చేసి ఇస్తుంటాడు. ఇతని వద్దకు నకుల్ సింగ్ అనే వ్యక్తి వచ్చి జమ్మూకశ్మీర్‌కు టికెట్ బుక్ చేయించుకున్నాడు.
రెండు వారాల క్రితం బుక్ చేసిన ఈ టికెట్ క్యాన్సిల్ చేయాలని నకుల్ కోరాడు. దీంతో టికెట్ క్యాన్సిల్ చేసిన నితిన్.. క్యాన్సిలేషన్ చార్జి కింద రూ.300 కట్ చేసుకొని మిగతా డబ్బును నకుల్‌కు ఇచ్చేశాడు.
సోమవారం తిరిగి షాప్ వద్దకొచ్చిన నకుల్, తన తమ్ముడు అరుణ్ సింగ్ (28)ను వెంటబెట్టుకొచ్చాడు. ఇద్దరూ కలిసి నితిన్‌తో గొడవకు దిగారు. 300 రూపాయలు తిరిగిచ్చేయాలని గొడవపడ్డారు.

దీంతో తన అంకుల్ మెహర్‌చంద్ శర్మకు ఫోన్ చేసిన నితిన్.. ఇలా ఇద్దరు వచ్చి షాప్ దగ్గర గొడవ చేస్తున్నారని చెప్పాడు.
తను వస్తున్నానని చెప్పి మెహర్ చంద్ అక్కడకు వెళ్లే సరికి.. షాప్ ముందు నిలబడ్డ తన మేనల్లుడిని నకుల్, అరుణ్ కారుతో తొక్కి చంపేశారు. వాళ్లిద్దరూ కావాలనే నితిన్‌ను కారుతో తొక్కించి చంపారని మెహర్ చంద్ వాపోయాడు.
నితిన్‌ను కారుతో తొక్కి, రివర్స్‌లో వచ్చి మళ్లీ అతనిపై కారు ఎక్కించారని, ఇలా రెండు మూడుసార్లు చేశారని వెల్లడించాడు. ఈ ఘటనపై నితిన్ తండ్రి సత్వీర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే నకుల్, అరుణ్ ఇద్దరూ పరారీలో ఉన్నారు.
నకుల్‌ను గుర్తించిన కొందరు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్టు చేశారు. అరుణ్ ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.