Bimbisara | ఏకఛత్రాధిపత్యం.. కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం..


నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఈ సినిమాతో కళ్యాణ్ బెగెస్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తను అనుకున్న విధంగా సినిమాను పవర్ ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ తన మార్క్ చూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. వారి ఆశ నెరవేరింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసి కళ్యాణ్ తన మార్క్ చూపించాడు. బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయాడు. శక్తివంతమైన రాజు పాత్రను అత్యద్భుతంగా పోషించాడు. దానికి తోడుగా అందరినీ ఆకట్టుకునే టైం ట్రావెల్ ఎలిమెంట్ కూడా ఇందులో ఉండనుంది. దీంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిని మించుతున్నాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు సినిమాలోని డెప్త్‌ను కనబరిచాయి.
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. ‘కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలొంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది’ అనే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. అంతేకాకుండా ‘అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం’ అనే డైలాగ్‌తో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు. బింబిసార పాత్రలో కళ్యాణ్ ఇమిడిపోయాడు. యుద్ధం సన్నివేశంతో బింబిసారను పరిచయం చేశారు. ఈ సీన్‌లో కళ్యాణ్ తన అద్భుత నటన కనబరిచాడు.
కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం.. అక్కడ సూట్ వేసుకుని కళ్యాణ్ రామ్ రౌడీలను కొడుతుంటాడు. ఈ సీన్‌లో టైం ట్రావెల్ గురించి చూపించారు. అంతేకాకుండా ఈ సీన్ టీజర్‌కు అభిమానులకు ఉన్న ఉత్సుకతను మరింత అధికం చేస్తోంది. అప్పటి రాజు ఈ కాలానికి వచ్చాడా? లేదంటే ఇక్కడి యువకుడు ఆ కాలానికి వెళ్ళాడా అన్నది? ప్రేక్షకులకు కోటి రూపాయల ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కొత్త దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. ఇందులో కాథరిన్, సమ్యుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.