

శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో ఇండస్ట్రీలోని పలువురు తమవంతు సహాయం అందించారు. ఈ జాబితాలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. వైద్యం కోసమని శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం మాస్టర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెరుగై వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మాస్టర్ పెద్దకుమారుడు అజయ్‌కి ధైర్యం చెప్పారు. మాస్టర్ త్వరగా కోలుకుంటారని, కంగారు పడొద్దంటూ అజయ్‌కి చెప్పారు. అనంతరం అజయ్ మాట్లాడుతూ.. ‘నాన్నకు చిరంజీవి అంటే ఎనలేని గౌరవం. చిరు గారు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమ’ని అన్నాడు.
ఇది కూడా చదవండి: RRR | ఆర్ఆర్ఆర్ ఆ టెస్ట్ కూడా పాస్ అయిందా..?
అయితే ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం రియల్ హీరో సోనూసూద్ తన వంతు సహాయం అందిస్తానని తెలిపాడు. అంతేకాకుండా మాస్టర్ కుటుంబంతో టచ్‌లో ఉంటానని, తన శక్తిమేర సాయం చేస్తానని చెప్పాడు. సోనూసూద్‌తో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తన వంతు సాయం అందించాడు. ఇదే విధంగా పలువురు తమ శక్తిమేర సహాయం చేశారు. అయితే ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం గురించి వైద్యులు ఏ విషయం చెప్పలేదు. ఇప్పటికీ ఐసీయూలోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఊపిరితిత్తులు చాలా వరకు ఇన్ఫెక్ట్ అయ్యాయని, అందుకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు.