

అతని గాధ అందరికీ కథే కావచ్చు కానీ నాకు కాదు, ఆయన గాధ నాకు ఎంతో నేర్పింది అని టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ అన్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ నటిస్తున్న తాజా సినిమా మేజర్. ఈ సినిమా మిలటరీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతోంది. ఇందులో ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాపై అప్‌డేట్ వచ్చి చాలా రోజులైంది. ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా నుంచి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
అయితే తాజాగా అడవి శేష్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. ‘ మేజర్ అందరికీ ఇది సినిమా అయినా నాకు మాత్రం ఓ ఎమోషన్. 26/11 తాజ్‌మహల్ బాంబ్ బ్లాస్ట్‌లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అత్యంత ధైర్య శాలి సందీప్ ఉన్నికృష్ణన్. అతని జీవితం అందరికీ ఓ కథ కావచ్చు. నాకు కాదు. అతడి జీవితం నాకు చాలా నేర్పింది. నా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప పాఠాల్లో అతని జీవితం కూడా ఒకటి. అతడి పాత్ర భౌతికంగా చేసేది నేనే అయినా మానసికంగా మాత్రం అడవి శేష్ కాదు’ అని అన్నాడు.
ఇది కూడా చదవండి: Sonu Sood | శివ శంకర్ మాస్టర్‌కు రియల్ హీరో చేయూత..
దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో అడవి శేష్ ప్రాణం పెట్టి పాత్రలో జీవించనున్నాడని అర్థం అవుతోంది. దీంతో అభిమానులకు ఈ సినిమాపై ఆసక్తి తారాస్థాయిని దాటిపోతోంది. మరి శేష్ ప్రేక్షకుల అంచనాలను అధిగమిస్తాడా లేదా అని తెలియాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 వరకు వేచి చూడాల్సిందే.