

ముంబై: దేశం మొత్తాన్ని కుదిపేసిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అసలు ఈ కేసు మొత్తం కల్పించిందేనని, ఎన్సీబీ చేసిన రెయిడ్ కూడా ప్రీ-ప్లాన్‌డ్ అని విజయ్ పగరే అనే సాక్షి వెల్లడించాడు. ఈ కేసులో మాస్టర్ మైండ్ అని బీజేపీ నేత మోహిత్ కంభీజ్ చెప్తున్న సునీల్ పాటిల్ తనకు తెలుసునని విజయ్ చెప్పాడు. ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసావి, ఈ కేసులో మరో సాక్షి పాంచ్ ఇద్దరూ ఈ కలిసి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని విజయ్ వెల్లడించాడు.
ఇదంతా పెద్ద డీల్ అని, ఈ డబ్బులో చాలా వరకు అధికారులకు చేరిందని ఆరోపించాడు. ఈ ప్లాన్‌లో కిరణ్, పాంచ్, బీజేపీ కార్యకర్త మనీష్ భానుశాలి హస్తముందన్నాడు. అయితే ఈ భారీ డీల్ కుదరలేదని వివరించాడు. గత ఆరు నెలలుగా సునీల్ పాటిల్‌తో తాను రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నానని చెప్పాడు. అతనికి తాను కొంత డబ్బు కూడా ఇచ్చి ఉన్నట్లు వెల్లడించాడు.
పాటిల్, గోసావి, భానుశాలితో కలిసి వివిధ హోటల్స్‌లో కొన్ని రోజులు గడిపినట్లు తెలియజేశాడు. ‘అక్టోబర్ 2న ఎన్సీబీ ఆఫీసుకు వెళ్తే మీడియా, జనాలు గుంపులుగా ఉన్నారు. ఏమైందో నాకు అర్థం కాలేదు. పక్కన ఉన్న ఒక వ్యక్తిని అడిగితే షారుఖ్ ఖాన్ కుమారుడు అరెస్టయ్యాడని చెప్పారు. పాటిల్, మిగతా వాళ్లు అన్ని రోజులు మాట్లాడుకున్న మాటలు నాకు అప్పుడే అర్థమయ్యాయి’ అని పేర్కొన్నాడు.